అంచనాల కమిటీ బాధ్యత పెద్దది

 శాసనసభ కమిటీల్లో ప్రభుత్వ అంచనాల కమిటీ బాధ్యత చాలా పెద్దదని.. దాని ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులపై ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభ కమిటీహాల్‌లో అంచనాల కమిటీ తొలి సమావేశం కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మం డలి చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు, పొదుపుపై సంపూర్ణంగా అవగాహన ఉండాలని.. వాటి వినియోగం ఎలా జరుగుతుందో చూడాల్సిన బాధ్యత కూడా అంచనాల కమిటీపై ఉన్నదని అన్నారు.


ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు మాట్లాడుతూ.. అంచనాల కమిటీ ప్రధానంగా అన్ని నివేదికలను కూలంకషంగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఒక పథకానికి బడ్జెట్‌లో పెడుతున్న ఖర్చుకు ఆ తర్వాత అంచనాకు మధ్య తేడా ఉంటున్నదని.. ఇది ఎందుకు వస్తుందో చూడాల్సిన అవసరం ఉన్నదన్నారు. శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు, వాటిని పొదుపుగా ఏ విధంగా ఖర్చు చేయవచ్చు అనే అంశాలపై కూడా అంచనాల కమిటీ సమీక్షించాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా, నిధులు దుర్వినియోగం కా కుండా అంచనాల కమిటీ నిరంతరం జాగురూకతతో వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో కమిటీ సభ్యులు కోనేరు కోనప్ప, ఆకుల లలిత, రియాజుల్ ఇఫెండి, బాలసాని లక్ష్మినారాయణ, జగ్గారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జూజుల సురేందర్, మాగంటి గోపీనాథ్, శాసనసభ కార్యదర్శి వీ నరసింహాచార్యులు పాల్గొన్నారు.